కన్నీరు ఉప్పెనై ఎగిసి పడుతున్నా
నిండిన చెక్కిలి పొంగి పొర్లుతున్నా
ఆపలేవు నా చిట్టి చేతులు
కాయవలసిన కంచెముల్లు గుండెలోన దిగితే
పంచవలసిన రక్తమాంసములు కాలకూటవిషమైతే
దాచలేని చిన్ని గుండె భళ్ళుమన్నది
నేను మోసిన పాపమేమి?
నేను చేసిన ఘోరమేమి?
ఎందుకు ఎందుకు నాకీ మరణశిక్ష?
ఎవరికి పడాలీ శిక్ష?
సంఘానికి వెరువని అమ్మా నీకా?
పోషించలేని నాన్నా నీకా?
నీతులు చెప్పే సంఘమా నీకా?
కృశించిపోతోంది చూపులకే కందేమేను
మూగవోతోంది లోకము వినని నా గుండె ఘోష
గర్భకుహరపు వెచ్చదనమే నా పాలిట చితిమంటలైతే
కాలిపోతోన్నది నేను కాదు మానవత్వం
ఓ విధాతా మరి రాయకు ఇటువంటి తలరాత.
అచంగ
తను బ్రతికేది ఎంత నీచమైన బ్రతుకైనా సరే ఏ ప్రాణీ (మనుషులకు మినహాయింపు) తనకు తాను చనిపోవాలనుకోదు. తన జనన మరణాలను నిర్ణయించుకోలేని, బలవంతముగా గొంతు నులిమేయబడుతున్న గర్భస్థ శిశువులకు అంకితం.