Powered By Blogger

Saturday 23 July 2011

kavitha


మరో వసంతముకై వేచి చూస్తున్నా నేస్తం


పడిఉన్న బండలాంటి నాపై విరిశావు గడ్డిపువ్వులా
కాలముమారి విధి ఎంత వెక్కిరించినా
చెరుపలేదు నువ్వొదిలిన మధుర ఙ్ఞాపకాలను
తిరిగిన వీథులు ఆడిన ఆటలు పలికిన ఊసులు
మరువలేను మరువలేను మరి ఎన్నటికీ
రాలే కన్నీళ్ళు చిక్కబరచు నెయ్యము నిక్కముగా
కాలచక్రం తిరిగి తిరిగి మరి రాకపోదు మనకై మళ్ళీ
మరో వసంతముకై వేచి చూస్తున్నా నేస్తం ఆశగా  
                                     అచంగ


చిత్రం: http://sandy515.deviantart.com/art/My-tears-hold-no-weight-159312637 వారి సౌజన్యంతో

శనివారం 23 ఏప్రిల్ 2011

భయపెడుతోంది నీ మౌనం


అలసిన నీ చిన్ని గుండె మరిలేచే పనిలేకుండా నిద్దరోతుంటే
కన్నుల నిండిన నీ రూపం కరిగేలా పొంగేను కన్నీళ్ళు
కడునిర్దయగా కలల రూపం పొత్తిళ్ళలో వదిలిపోతే
మిగిలింది రసమాధురిలేని ఉప్పునీటి కడలి కల్లోలం
ఙ్ఞాపకాలను మళ్ళీ మళ్ళీ చదువుకునే వెర్రివాడిని
నిజాలను మరి మరి ఏమార్చుకు తిరిగే పిచ్చివాడిని
కృంగదీస్తున్న నీ మౌనం భయపెడుతుంటే భీకరమై
హరితా పసిగుడ్డు ఏడుపుకు అర్థాలే వెదకనా
ముక్కలైన నా మనసు బీటలకి మందునే రాయనా
అందించీ అందించక జీవన మాధుర్యము వామనుని చేశావే.. 
------------అచంగ

ఆదివారం 17 ఏప్రిల్ 2011

ఎవరికి పడాలి శిక్ష?


కన్నీరు ఉప్పెనై ఎగిసి పడుతున్నా
నిండిన చెక్కిలి పొంగి పొర్లుతున్నా
ఆపలేవు నా చిట్టి చేతులు

కాయవలసిన కంచెముల్లు గుండెలోన దిగితే
పంచవలసిన రక్తమాంసములు కాలకూటవిషమైతే
దాచలేని చిన్ని గుండె భళ్ళుమన్నది

నేను మోసిన పాపమేమి?
నేను చేసిన ఘోరమేమి?
ఎందుకు ఎందుకు నాకీ మరణశిక్ష?

ఎవరికి పడాలీ శిక్ష?
సంఘానికి వెరువని అమ్మా నీకా?
పోషించలేని నాన్నా నీకా?
నీతులు చెప్పే సంఘమా నీకా?

కృశించిపోతోంది చూపులకే కందేమేను
మూగవోతోంది లోకము వినని నా గుండె ఘోష
గర్భకుహరపు వెచ్చదనమే నా పాలిట చితిమంటలైతే
కాలిపోతోన్నది నేను కాదు మానవత్వం

ఓ విధాతా మరి రాయకు ఇటువంటి తలరాత.
                             అచంగ


తను బ్రతికేది ఎంత నీచమైన బ్రతుకైనా సరే ఏ ప్రాణీ (మనుషులకు మినహాయింపు) తనకు తాను చనిపోవాలనుకోదు. తన జనన మరణాలను నిర్ణయించుకోలేని, బలవంతముగా గొంతు నులిమేయబడుతున్న గర్భస్థ శిశువులకు అంకితం. 

శుక్రవారం 8 ఏప్రిల్ 2011

రాలే నా కన్నీళ్ళలో

రాలే నా కన్నీళ్ళతో ఎక్కడ నీ రూపం కరిగి జారిపోతుందో
అని కమ్మిన చీకట్ల కబంధ హస్తాల కౌగిలిలో మగ్గి మగ్గి
పాతాళపు అంచుల్లో పాషాణమైపోయాను

వెలువడే నా వేదనలో ఎక్కడ నీ పిలుపు వినబడదో అని
నీ ప్రేమ దాహము తీరని నా మనసులో శూన్యము నింపి నింపి
మౌనము చేసిన గాయాలతో ముక్కలైపోయాను.

జంట ప్రయాణానికి బాసచేసీ నా మది ఆశల సౌధముపై
హరితా నీ మరణము సాగించిన ధ్వంసరచన

శ్రీకాకుళాంధ్ర దేవుని కరుణావర్షము ఎలిసిపోయిందేమో
దిక్కులన్నీ ఎకముచేసి నిన్ను ఎతుక్కోమనే
మిక్కుటముగా బీటలిచ్చిన నా మనసు మూలల్లో
అచంగ(20-02-09)

ఆదివారం 3 ఏప్రిల్ 2011

అమ్మా కృష్ణవేణి........



ఈ చిత్రము తెలుగు వికీపీడియానుంచి సంగ్రహించబడినది. తెవికీకి ధన్యవాదాలు.
విజయవాడ వద్ద అఖండ కృష్ణవేణి.
సహ్యాద్రి గిరిపుత్రి కన్నడరాజ్య కస్తూరి
సరస నాట్యమయూరి ప్రణవనాదఝరి
దయామయి నల్లమల కంఠహారిణి
కరుణాతరంగిణి త్రిమూర్తి స్వరూపిణి
తెలుగులోగిలి సౌభాగ్యదాయిని కృష్ణవేణికి
ప్రణమిల్లు హరితా అంబ నీకు సర్వ సుఖదాయిని.
అచంగ(30-07-07)

ఆదివారం 20 మార్చి 2011

ఉలి దెబ్బల విందులు


ఉలి దెబ్బల విందులెన్నో తిన్నాను
నా మనసును రాణివాసము చేద్దామని
దక్షిణామూర్తికి దయలేదేమో నాపై 
ఉప్పొంగిన కృష్ణలా విలయనర్తనం చేస్తే
రాలేందుకు రుధిరమూ లేదు కన్నుల, హరితా.

2 comments:

  1. రవితేజ గారూ,
    నా అనుమతి లేకుండా నా బ్లాగు సమాచారాన్ని వాడటం చట్టరీత్యా నేరం. తక్షణం తొలగించగలరు.

    ReplyDelete
  2. రవితేజ గారూ,
    మీకు నా బ్లాగునుండి నా అనుమతి లేకుండా ఎత్తుకొచ్చిన సమాచారాన్ని తొలగించమని నోటిసు ఇచ్చి 48గం పైన అయ్యింది. అయినా మీరింతవరకూ ఆ సమాచారాన్ని మీ బ్లాగు నుండి తొలగించలేదు. కావున తదుపరి న్యాయపరమైన చర్యలు తీసుకోవటానికి మరో 24 గంటలు వేచి చూస్తానని మీకు ఇందుమూలంగా తెలియజేయటమైనది. ఆ తర్వాత కూడా తొలగించని పక్షములో ప్రెస్టన్ జిల్లా న్యాయస్థానము, ఇంగ్లాండు నందు సంబంధిత కేసు నమోదు చేయబడుతుందని హెచ్చరించటమైనది.

    ReplyDelete